మాట్లాడు ... మాట్లాడించు...
ఆన్‌లైన్ రేడియోతో విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానం
" మీ పాఠశాలలో వినూత్న కార్యక్రమాలకు చోటిస్తారా?
మీ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తారా?
వారిలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచేందుకు కాస్తంత సమయం కేటాయిస్తారా?
అయితే రండి .. మనమంతా కలిసి మీ పాఠశాలలో స్కూల్ రేడియో క్లబ్‌ను మొదలు పెడదాం" అంటూ ఓ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది స్కూల్ రేడియో.
యువ భారత్‌గా మారిపోయిన మన దేశంలో బాలలు, యువకుల శాతం 70 కి పైగానే ఉంది. కానీ యువత, బాలల సమస్యలను మనం ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నాం. వారి ప్రాధాన్యతలేమిటో, వారేం కోరుకుంటున్నారో మనం తెలుసుకోవటం లేదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలంటూ ప్రత్యేకంగా యువత కోసం, బాలల కోసం స్కూల్ రేడియోను ప్రారంభించటం జరిగింది. ఇప్పటివరకు శ్రోతలుగా, ప్రేక్షకులుగా మిగిలిపోయిన యువతకే పట్టం కడుతూ, వారే వక్తలుగా, కార్యక్రమ నిర్వాహకులుగా. వాళ్లకేం కావాలో వాళ్ళే నిర్ణయించుకునేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను స్కూల్ రేడియో మొదలు పెట్టింది.
స్కూల్ రేడియో ఎందుకు?
క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని మనం ఎంతగానో నియంత్రిస్తాం. వాళ్ళ అభిప్రాయాలను చెప్పబోతే, నీకేం తెలియదు నోరు మూసుకో అంటూ గద్దించే పెద్దలే ఎక్కువ. పెద్దల మాట పిల్లలు వినాలే తప్ప, వారి మాటలూ వినాలని, వారి అభిప్రాయాలనూ గౌరవించాలని తల్లిదండ్రులు సాధారణంగా భావించరు. పాఠశాలలోనూ ఉపాధ్యాయులు చెప్పింది వినటం, పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయాలను పరీక్షల్లో వ్రాయటమే తప్ప, స్వంతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు చిన్నారులకు అవకాశం లభించటం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పును తీసుకువచ్చేందుకు గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, సమాచార హక్కు, వినియోగదారుల హక్కులు, జెండర్, కమ్యూనికేషన్స్ తదితర రంగాలలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసిన సామాజిక కార్యకర్తలు అరుణ, గాలి ఉదయకుమార్ స్కూల్ రేడియో ను ప్రారంభించారు. వినూత్నమైన ఈ ప్రాజెక్టుకు ప్రఖ్యాత విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బెంగుళూరు; ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విశాఖపట్నం ల మద్దతు కూడ లభించింది.
విద్యార్థులే నిర్వాహకులు
చిన్నారుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను ప్రసారం చేసే రేడియోలు, టెలివిజన్ ఛానళ్ళు ఎన్నో ఉన్నాయి కానీ, కేవలం విద్యార్థులే స్వయంగా కార్యక్రమాలను రూపొందించటం మాత్రం స్కూల్ రేడియోలోనే సాధ్యం. ప్రసారం చేయాలనుకొనే అంశాలకు సంబంధించిన ఇతివృత్తాలను ఎంచుకోవటం, సమాచారాన్ని సేకరించటం, స్క్రిప్ట్ రాయటం, రాసిన స్ర్కిప్ట్‌ను సరిదిద్దటం వంటి పనులను విద్యార్థులంతా కలిసి చేస్తారు. తర్వాత తమ రేడియో కార్యక్రమాలను రికార్డు చేస్తారు. రికార్డు చేసిన ఆడియో ఫైల్ లను ఎడిట్ చేసి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జత చేస్తారు. ఇలా సిద్ధమైన కార్యక్రమాలను స్కూల్ రేడియోలో ప్రసారం చేయటం జరుగుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషులతో పాటు వివిధ భారతీయ భాషలలో కార్యక్రమాలను చిన్నారులు, యువత రూపొందిస్తున్నారు.
తాము నివసిస్తున్న గ్రామం లేదా నగరాలలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను విద్యార్థులు స్వయంగా ఇంటర్వ్యూ చేస్తారు. తమ ప్రాంతంలోని పర్యావరణ, సామాజిక సమస్యలను అధ్యయనం చేసి, సమస్య మూలాలను అర్థం చేసుకొంటూ, ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వమూ ప్రజలూ ఏం చేయాలో సూచిస్తూ రేడియో కార్యక్రమాలను తయారు చేస్తారు. ఇలా సామాజిక స్పృహ కలిగిన పౌరులుగా వారు ఎదిగేందుకు స్కూల్ రేడియో చేయూత నిస్తోంది.
ఏమైనా మాట్లాడవచ్చు
చిన్నారులు స్కూల్ రేడియోలో ఏమైనా మాట్లాడవచ్చు. పాఠ్య పుస్తకాలలోని పాఠాలను చెప్పవచ్చు. చదివిన పుస్తకాలను సమీక్షించవచ్చు. చూసిన సినిమాలను విశ్లేషించవచ్చు. తాము ఆడే ఆటల గురించి మాట్లాడవచ్చు. పండుగలు, ఉత్సవాలు, ఆచార వ్యవహారాలు, రాజకీయాలు, సామాజిక సమస్యలు, పర్యావరణ అంశాలు ఇలా ఏం మాట్లాడాలనేది వాళ్ళ ఇష్టం. సహ విద్యార్థులతో కలిసి చర్చించి, తమకు నచ్చిన అంశాలను ఎంచుకోని కార్యక్రమాలను తయారు చేయవచ్చు.
స్కూల్ రేడియో క్లబ్‌లు
స్కూల్ రేడియో ను పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రారంభించేందుకు ముందుగా స్కూల్ రేడియో క్లబ్ లను ఏర్పాటు చేస్తారు. ప్రతి స్కూల్ రేడియో క్లబ్ లో పది మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. ఈ స్కూల్ రేడియో క్లబ్‌లు ప్రతి నెలా రేడియో కార్యక్రమాలను రూపొందిస్తాయి. ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు స్కూల్ రేడియోలో ప్రసారమౌతాయి. ఈ కార్యక్రమాలను www.schoolradio.in వెబ్‌సైట్‌ను సందర్శించి వినవచ్చు.
స్కూల్ రేడియో క్లబ్‌ల కోసం ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలను విద్యాసంస్థలలో నిర్వహిస్తారు. కరోనా తదనంతర పరిస్థితులలో ఆన్‌లైన్‌లో కూడ శిక్షణ ప్రారంభమైంది. స్కూల్ రేడియో శిక్షణా కార్యక్రమాలలో చెప్పదలిచిన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం వ్రాయటం, కథలను చెప్పగలగటం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచటం, బహిరంగ సభలు, సమావేశాలలో ప్రసంగించటం వంటి విషయాల్లో యువతను సిద్ధం చేయటంతో పాటు వాయిస్ రికార్డింగ్, ఆడియో ఫైల్స్ ఎడిటింగ్ వంటి సాంకేతిక అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. టాక్ షోలు, రేడియో నాటికలు, చర్చా కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, పాటలు, పద్యాలతో పాఠశాల విద్యార్థులు తామే స్వయంగా రేడియో కార్యక్రమాలను రూపొందించేలా వారికి చేయూత నివ్వటం జరుగుతోంది. పాఠ్యాంశాలకూ ఈ రేడియో కార్యక్రమాలలో చోటు వుంటుంది. నిరక్షరాస్యత, బాల కార్మికులు, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ భారత్, లింగ వివక్ష వంటి పలు సామాజిక అంశాల మీద తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేసేలా తర్ఫీదు ఇస్తోంది స్కూల్ రేడియో. వినోదంతో పాటు విజ్ఞానాన్ని ఇస్తూ యువతలో సామాజిక స్ఫూర్తిని నింపే లక్ష్యంతో స్కూల్ రేడియో క్లబ్‌లను నిర్వహించటం జరుగుతుంది.
చిన్నారి రచయితలు
రేడియో కార్యక్రమాలను రూపొందించేందుకు అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని అందించేందుకు, విద్యార్థులలో స్ఫూర్తిని పెంచేందుకు స్కూల్ రేడియో ప్రత్యేకంగా ఎన్నో పుస్తకాలను ప్రచురించింది. అలాగే చిన్నారులు వ్రాసిన కథలు, కవితలు, నాటికలకు స్థానం కల్పిస్తూ పిల్లలు రాసిన కథలతో బాల, చిన్నారి, ప్రతిబింబం, ఆనందాల హరివిల్లు పుస్తకాలను ఇప్పటికే ప్రచురించింది. స్కూల్ రేడియో ప్రచురించిన చీమా చీమా ఎందుకు కుట్టావు? పుస్తకంలోని కథలను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని సంస్కృత పాఠశాల విద్యార్థులు తెలుగులోకి అనువదించగా, పిపీలికే పిపీలికే కిమర్థం దంశసి? పేరిట ఈ పుస్తకాన్ని స్కూల్ రేడియో ప్రచురించింది. ఉన్నత పాఠశాల విద్యార్థులు తెలుగు నుంచి అనువదించగా ప్రచురితమైన తొలి సంస్కృతం పుస్తకంగా ఇది గుర్తింపు పొందింది. చిన్నారుల భాగస్వామ్యంతో ఆడియో, వీడియో, టెక్స్ట్ తో కూడిన మల్టీ మీడియా డిజిటల్ పుస్తకాలను కూడ రూపొందించి, అందరికీ అందుబాటులో వుంచుతోంది.
భయం పోయింది!
"అప్పట్లో నలుగురి ముందు మాట్లాడటానికే సిగ్గు వేసేది. మైక్ పట్టుకోవాలంటే చెమటలే పట్టేసేవి. వేదిక మీద నిలబడాల్సి వస్తే వళ్ళంతా వణికిపోయేది. ఇపుడు వేదికల మీద నిర్భయంగా మాట్లాడగలుగుతున్నాను" స్కూల్ రేడియో శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది.
స్కూల్ రేడియోతో వ్యక్తిత్వ వికాసం
"ఇప్పటికే పిల్లల మీద ఎంతో వత్తిడి వుంటోంది. మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలా" అంటూ ముందు సందేహంగా చూసిన ఉపాధ్యాయులూ "భావ వ్యక్తీకరణ నైపుణ్యాలే కాదు, వ్యక్తిత్వ వికాసానికి కూడ స్కూల్ రేడియో ఉపయోగపడుతుందని" ఇపుడు ఒప్పుకుంటున్నారు.
ఆన్‌లైన్ పాఠాలు
కరోనాతో ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పవలసిన అవసరం తలెత్తింది. స్కూల్ రేడియోలో ఆన్‌లైన్ పాఠాలు ముందునుంచే ఉన్నాయి. ఉపాధ్యాయులు తమకు నచ్చిన అంశాలను ఎంపిక చేసుకొని, స్కూల్ రేడియోలో చెప్పవచ్చు. ఆన్‌లైన్ విధానంలో తరగతి గదుల నిర్వహణకు సంబంధించి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను కూడ స్కూల్ రేడియో నిర్వహించింది. పాఠ్యాంశాలకు అనుగుణంగా ఇంటరాక్టివ్ యాక్టివిటీలను ప్రత్యేకంగా తయరు చేయటం ద్వారా విద్యార్థులను ఆన్‌లైన్ తరగతులలో నిమగ్నమయ్యేలా సిద్ధం చేయటం గురించి తెలియజేయటం జరిగింది.
కెరీర్‌కూ దోహదం
మన దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో పిల్లల్ని చేర్చటమే తమ జీవిత ధ్యేయంగా పెట్టుకున్న తల్లిదండ్రులు ఎందరో! ఫలితంగా చిన్నారులపై మానసిక వత్తిడి తీవ్రంగా పడుతోంది. తమకు ఆ కోర్సులంటే ఇష్టం లేకపోయినా, కేవలం తమ తల్లిదండ్రుల కోరికను కాదనలేక మార్కుల కోసం, ర్యాంకుల కోసం విద్యార్థులు కష్టపడటం, ఒక్కోసారి వత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడటాన్ని కూడ మనం చూస్తున్నాం. ఇపుడు ఇంజనీరింగ్, మెడిసిన్ పట్టభద్రులు ఎందరో తమ చదువునూ, సర్టిఫికెట్లనూ పక్కన పెట్టి తమకు ఇష్టమైన రంగాలలో పనిచేయటాన్నీ చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సుల గురించిన సమాచారాన్ని విద్యార్థులకు అందజేస్తూ, ఆయా కెరీర్ ఎంపికల గురించి ప్రత్యేక కార్యక్రమాలను వారే రూపొందించేలా స్కూల్ రేడియో చేస్తోంది.
ఇప్పటి వరకు కేవలం కార్పొరేట్ లేదా ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమైన స్కూల్ రేడియో కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాలలకు కూడ విస్తరించటం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధిస్తూ, ఉన్నత ర్యాంకులను సాధిస్తున్నప్పటికీ, వారిలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు మాత్రం చాలా నిరాశాజనకంగా వుంటున్నాయి. వారిలో ఆత్మ విశ్వాసం కొరవడటం, నలుగురి ముందు మాట్లాడేందుకు భయపడటం ఇందుకు ప్రధాన కారణమవుతోంది. ఫలితంగా బహుళ జాతి సంస్థలలో వారు ఉద్యోగాలు సాధించటంలో వెనుకబడుతున్నారు. కనుక వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచటంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడ స్కూల్ రేడియో కార్యక్రమం ద్వారా పెంపొందించటం జరుగుతుంది.
ప్రత్యేక దినాలు, ప్రత్యేక కార్యక్రమాలు
అంతర్జాతీయ, జాతీయ దినాలను ఎన్నింటినో మనం జరుపుకొంటూ ఉంటాం. అయితే వీటిని మొక్కుబడిగా పాటించటమే తప్ప, వాటి ప్రత్యేకత ఏమిటో ఎక్కువ మందికి తెలియదు. విద్యార్థులకు చెప్పే వారూ ఉండరు. కానీ స్కూల్ రేడియోలో ప్రత్యేక దినాలకు టైమ్ స్లాట్ కేటాయించటం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు ఈ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఆయా దినాల ప్రత్యేకతను అర్థం చేసుకొనేందుకు విద్యార్థులు ఇంటర్నెట్‌ను శోధిస్తారు. గ్రంథాలయాలలో పుస్తకాలను చదువుతారు. సంబంధిత నిపుణులతో మాట్లాడతారు. సంబంధిత సమస్యలు, పరిష్కార మార్గాల గురించి ఆలోచిస్తారు. ఫలితంగా వారిలో ఆసక్తితో పాటు అవగాహన కూడ పెరుగుతుంది.
===
తప్పిపోయిన కార్డు కథ!
వ్యర్థాల నిర్వహణ అంశంపై పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్న మాకు ఒక వింత అనుభవం ఎదురైంది. తడి, పొడి వ్యర్థాలు, జీవ వైద్య వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇలా రకరకాల వ్యర్థాలతో కూడిన ఫ్లాష్ కార్డులను విద్యార్థులకు ఇచ్చి, వాటి గురించి మాట్లాడమని అడిగే వాళ్ళం. ఆయా వ్యర్థాలను ఎలా తొలగించాలి, వ్యర్థాల నిర్వహణలో పాటించవలసిన విధివిధానాల గురించి విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలియజేయాలి. ఈ కార్డులలో శానిటరీ నాప్కిన్ చిత్రంతో కూడిన కార్డు కూడ ఉండేది. కానీ విద్యార్థినీ విద్యార్థులలో ఎవరూ కూడ దీని గురించి అసలేమీ చెప్పేవారు కాదు. పైగా ఆ కార్డును మాకు తిరిగి ఇవ్వకుండా, డెస్క్‌ల కిందో, పుస్తకాల మధ్యనో దాచిపెట్టేసే వారు. మానవ జీవితంలోని ఒక సహజమైన ప్రక్రియ గురించి మాట్లాడేందుకు చిన్నారులు, యువత సిగ్గు పడుతున్నారని, వారిలో ఎన్నో అపోహలు ఉన్నాయని ఈ సంఘటన మాకు స్పష్టం చేసింది. దాంతో ది స్టోరీ ఆఫ్ మిస్పింగ్ కార్డ్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మేము డిజైన్ చేశాం. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, నెలసరి లేదా పీరియడ్స్ గురించిన శాస్త్రీయమైన అవగాహనను విద్యార్థులలో కలిగించేందుకు, ఈ అంశం చుట్టూ నెలకొని వున్న అపోహలను, భయాలను తొలగించేందుకు స్కూల్ రేడియోలో ప్రత్యేక కార్యక్రమాలకు చోటు కల్పించాం.
అరుణ, వ్యవస్థాపకురాలు, స్కూల్ రేడియో
===
ఇది యువతరం రేడియో
తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఒక వేదిక ఉందనీ, తాము చెప్పే విషయాలను ప్రపంచమంతా వింటోందనీ తెలిసినప్పుడు యువతలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. రేడియో కార్యక్రమాలను రూపొందించే ప్రక్రియలో భాగంగా నలుగురి ముందు భయం లేకుండా మాట్లాడటం నేర్చుకొంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. టీమ్‌లలో పనిచేయటం, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించటం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించటం, స్వయంగా నేర్చుకోవటం వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను వారు అలవర్చుకొంటారు. తమ కమ్యూనిటీలోని వివిధ రంగాల ప్రజలను, నిపుణులను, అధికారులను కలిసి మాట్లాడటం, చర్చించటం ద్వారా సామాజిక సమస్యల పట్ల, ప్రాపంచిక దృక్పథాల పట్ల స్పష్టమైన అవగాహన పెరగటం ద్వారా సమాజాన్ని మార్చే శక్తివంతమైన నవ యువతరం ఈ దేశానికి లభిస్తుంది.
గాలి ఉదయ కుమార్, డైరెక్టర్, స్కూల్ రేడియో
===
:: School Radio, B-74 Dayal Nagar, Visakhapatnam 530043 :: Ph: 9440994244 :: info@schoolradio.in :: www.schoolradio.in